చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలలో సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. ఈ ముగ్గుల పోటీలలో 126 మంది మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పోటీలలో భాగంగా రంగవల్లులు తీర్చిదిద్దిన వారందరికీ రూ.10,116 చొప్పున కానుక ఇస్తున్నట్టు చెప్పారు. అందరికీ సుఖ, సంతోషాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. పిల్లలకు నిర్వహించిన వివిధ రకాల పోటీలను చంద్రబాబు తిలకించారు. నారావారిపల్లెలో విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం సహా పలు అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.