ఏపీ వాహనదారులకు బిగ్ షాక్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సరుకు, ప్రయాణికుల రవాణా వాహనాలపై హరితపన్ను గతేడాదే భారీగా పెంచి మోయలేని భారం వేసిన ప్రభుత్వం, తాజాగా త్రైమాసిక పన్నును పెంచి మరోసారి నడ్డి విరిచేందుకు సిద్ధమైంది.
ఇప్పటికే డీజిల్ ధరలు పెరగడం, పక్క రాష్ట్రాల్లో తక్కువ డీజిల్ ధరలు, తక్కువ పన్నుల వల్ల వాటితో పోటీ పడలేకపోతున్న ఏపీలోని సరుకు రవాణా వాహనాదారులపై రాష్ట్ర సర్కారు మరో పిడుగు వేస్తోంది.
సరుకు రవాణా వాహనాలకు త్రైమాసిక పన్నును 25 నుంచి 30% వరకు పెంచేలా ప్రాథమిక గేజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై నెల రోజుల్లోనే అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలపాలని, తర్వాత ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. కాంట్రాక్టు క్యారియర్ బస్సులపై సీటుకు రూ. 250 చొప్పున త్రైమాసిక పన్ను పెంచుతున్నారు.