బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో బిజెపి మతరాజకీయాలను ప్రేరేపిస్తుందని విమర్శించారు. ప్రజల మధ్య విభజన రేఖ గీసేందుకే యూనిఫాం సివిల్ కోడ్ (UCC) తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈసారి పార్లమెంట్ సమావేశాలలో యూసీసీనే ప్రధాన అజెండా అని తెలిపారు.
బిజెపి మూడవసారి అధికారంలోకి వస్తే భారతదేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా చేస్తుందని అభిప్రాయపడ్డారు. దేశంలో రైతులు ఎక్కడా సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు రామకృష్ణ. నిరుద్యోగ, రైతుల సమస్యలు అలానే ఉన్నాయన్నారు. ఉమ్మడి పౌరస్మృతి తో మరోసారి బిజెపి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరగాలన్నారు.