CM ఢిల్లీ పర్యటన తర్వాత కేబినెట్, ఎమ్మేల్యేలు సమావేశంలో ముఖ్యమంత్రి జామిలి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. అంటే కూటమి మాటగా చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఈ ప్రభుత్వం కాలం రెండున్నర ఏళ్లు అని అర్థం అవుతుంది అని బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకే సంక్రాంతి వరకు కూటమి ప్రభుత్వానికి సమయం ఇద్దామనే మా ఆలోచన మార్చుకున్నాం. ఈ ప్రభుత్వానికి సమయం తక్కువగా ఉన్నందున ఎన్నికల హామీల అమలు కోసం డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల హామీలను ఎప్పుడు నుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రజల తరపున వైసీపీ డిమాండ్ చేస్తోంది.
వైసీపీ అధికారంలో వున్నపుడు టన్ను ఇసుక 475 రూపాయల లెక్క రీచ్ ల్లో అందుబాటులో వుండేది. తగ్గించిన ఇసుక ధరలు ఎప్పుడు నుంచి అమలు చేస్తారో ముఖ్యమంత్రి చెప్పాలి. ఇసుక రీచ్ ల దగ్గర ధరల పట్టిక ఎందుకు పెట్టడం లేదు.. చెప్పే మాటలు వాస్తవానికి దగ్గరగా వుండాలి. మా ప్రభుత్వంలో ఇసుక మీద 750 కోట్లు ఆదాయం చూపించాం. గత ప్రభుత్వంలో ప్రాణాలు తీశాయని ప్రచారం చేసిన మద్యం బ్రాండ్లు ఇప్పుడు మార్కెట్లో వున్నాయి.. వీటిని ఎందుకు కట్టడి చెయ్యలేదు.. నిత్యావసరాల ధరలు ఆకాశంలో… మద్యం ధరలు భూమి మీద ఉన్నాయి బొత్స పేర్కొన్నారు.