జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడుల తరగతి గదిలో సెల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లకూడదు. ఉపాధ్యాయులు బోధనా సమయాల్లో సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా మొబైల్ ఫోన్లను ఉపయోగించడం నిషేధం.
ఉదయం హాజరు వేసిన వెంటనే ఫోన్ ను సైలెంట్ మోడ్ లో ఉంచాలి. మొబైల్ వినియోగం అవసరమయ్యే పరిపాలనా పనులను బోధన సమయం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలి. ఉదయం 9:30 గంటలకు ముందు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత చేయాలి. తరగతి ప్రారంభమైన తర్వాత ఏదైనా అనుకోకుండా అటువంటి కార్యకలాపాలు చేయాల్సి వస్తే ప్రధానోపాధ్యాయుడి ద్వారా మాత్రమే చేయాలి. ఉపాధ్యాయుడు బోధన కోసం ఫోను ఉపయోగించాలని భావిస్తే దాని గురించి ముందుగానే తన లెసన్ ప్లాన్ లో మొబైల్ ఎందుకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారో రాసి, ప్రధానోపాధ్యాయుడి దగ్గర అనుమతి తీసుకోవాలని ఆదేశించింది విద్యాశాఖ.