తాడేపల్లి: కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. నారా వారి పల్లెలో చంద్రబాబు తాను చదివిన స్కూల్ నే పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అవకాశం ఇస్తే పేదల గురించి పట్టించుకున్నారా? అని నిలదీశారు సజ్జల. జగన్ చేసిన దాంట్లో .00001 అన్నా చంద్రబాబు చేసి ఉంటే కనీసం ఇవాళ చెప్పుకోవటానికి అయినా అర్హత ఉండేదని దుయ్యబట్టారు.
ఒకసారి మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడని.. 1999లో వాజ్ పేయ్ భుజాలు ఎక్కి అధికారంలోకి వచ్చాడని.. 2014లో కూడా ఊతకర్రలతోనే వచ్చాడని దుయ్యబట్టారు. మోడీ, పవన్ కళ్యాణ్ మోస్తే వంద సీట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు సజ్జల. కానీ.. వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం ఐదేళ్ళల్లో కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించారని అన్నారు. చంద్రబాబు చివరికి మరుగు దొడ్లను కూడా మింగేశాడని మండిపడ్డారు సజ్జల. మాట్లాడటానికి ఏమీ లేక చంద్రబాబు బూతులు తిడుతున్నాడని.. నోరు విప్పితే పీకటం అనే పదమే చెబుతున్నారు తండ్రి, కొడుకులు అంటూ దుయ్యబట్టారు.