ఏపీ 16వ శాసనసభ కొలువుదీరింది. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి సీఎం చంద్రబాబు సభ లోపలికి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో గౌరవ సభకు చంద్రబాబు హాజరయ్యారు. రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీకి ఆయన వచ్చారు. అంతకుముందు సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు వెంకటపాలెం చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
అక్కడి నుంచి చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయిస్తున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో ఆయన శపథం చేశారు. దాన్ని నిలబెట్టుకుంటూ ఆయన శుక్రవారం అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా సభకు చేరుకున్నారు. శాసనసభ ప్రాంగణంలోకి జగన్ వాహనానికి ఇవాళ్టికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. సాధారణ ఎమ్మెల్యేగానే జగన్ ప్రమాణం చేస్తారని పయ్యావుల తెలిపారు.