ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిఆర్డిఏ పరిధిలో ( కృష్ణాయపాలెం జగనన్న లేఅవుట్) పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని వెంకటాయపాలెం చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం వెంకటపాలెంలోని సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించారు మంత్రి జోగి రమేష్, విడదల రజిని.
ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ.. పేదల ఇళ్లను అడ్డుకున్న వారికి ఇదొక కనువిప్పు అన్నారు. చంద్రబాబు ఎక్కడా లేని చట్టాలను తీసుకువచ్చి మంచిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అన్నారు. సీఎం జగన్ ది పేదలకు మంచి చేయాలనే తపన అని చెప్పుకొచ్చారు. పేదల వ్యతిరేకిగా చంద్రబాబు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాడని.. పేదల పక్షపాతిగా సీఎం జగన్ ప్రజల మనసులో నిలిచిపోతారని అన్నారు.