ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 5 అంశాల అమలు దస్త్రాలపై సంతకాలు చేశారు. లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించేలా.. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసే దస్త్రంపై నమొదటి సంతకం చేశారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఫైల్‌పై రెండో సంతకం, లక్షల మంది లబ్ధిదారులకు మేలు కలిగేలా సామాజిక భద్రత పింఛన్లను రూ.4వేలకు పెంచుతూ లబ్ధిదారుల సమక్షంలో మూడో సంతకం చేశారు.
మరోవైపు యువత, విద్యార్థుల్లో నైపుణ్యాలు గుర్తించి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు వీలుగా నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్) దస్త్రంపై విద్యార్థులు, యువత సమక్షంలో నాలుగో సంతకం చేసిన చంద్రబాబు.. లక్షల మంది పేద ప్రజల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ ఐదో సంతకం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయా కార్యక్రమాలు, పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. చంద్రబాబు 2019 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినియోగించిన ఛాంబర్‌నే ఇప్పుడూ తీసుకున్నారు.