నేరాలు చేస్తే.. రౌడీలకు అదే చివరి రోజు అని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొని అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కక్షసాధింపులే పనిగా పెట్టుకుంది. రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తే ఊరుకోం అని హెచ్చరించారు.
పోలీసులు ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు. ఫింగర్ ప్రింట్స్ కోసం రూ.10కోట్లు ఇవ్వలేదన్నారు. సీసీటీవీల కోసం గత ప్రభుత్వం రూ.700 కోట్లు ఇవ్వలేకపోయిందన్నారు. రూ.700 కోట్లు ఇచ్చి ఉంటే.. రాష్ట్రంలో ఈ అఘాయిత్యాలు జరిగేవి కాదు అన్నారు సీఎం చంద్రబాబు. హిందుపురం ఘటన, బద్వేల్ ఘటనలలో స్పెషల్ కోర్టుల్లో విచారణ జరుగుతుంది. నిందితులకు కఠిన శిక్ష పడేలా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. నేరాల తీరు మారుతుంది. టెక్నాలజీ పెరిగిన కొద్ది సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వాళ్ల కంటే మెరుగ్గా చేస్తే.. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలుగుతామని పోలీసులకు విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు.