జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసింది. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగాలపై ఈ కేసు నమోదైంది. గతేడాది జులై 9న పవన్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో ప్రభుత్వం కేసు నమోదు చేసింది. తాడికొండ మండలం కంతేరుకి చెందిన వాలంటీర్ పవన్ కుమార్‌తో పాటు మరి కొందరు ఇచ్చిన వాంగ్మూలంపై కేసు నమోదు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్‌పై జిల్లా కోర్టు క్రిమినల్ కేసు నమోదు చేయగా.. నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. మార్చి 25వ తేదీన గుంటూరు కోర్టులో పవన్ హాజరు కావాలని నాలుగో అదనపు జడ్జి శరత్‌బాబు తాజాగా ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ కేసు పై తాాజాగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసు నమోదు చేసిందని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థకు అసలు చట్టపరమైన గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు. దీనిపై ప్రశ్నిస్తే కేసు పెడతారా..? వాలంటీర్లు సేకరించిన సమాచారం ఎక్కడ భద్రపరుస్తున్నారో చెప్పకుండా మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. వాలంటీర్లకు ఏటా రూ.1760 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.67 కోట్లు డేటా సేకరణకే కేటాయించారని ఆరోపించారు.