ఏపీకి కేంద్రం పదేపదే ద్రోహం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి పట్టదా? అని ప్రశ్నించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును కూడా కేంద్రం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదు, విభజన హామీల అమలు లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం లేదు, రెవిన్యూ లోటు భర్తీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం తెగనమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు 31 మంది వైసిపి ఎంపీలు ఉన్నా చేతులు ముడుచుకున్నారే? అని ప్రశ్నించారు. 31 మంది ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచితే ఏపీకి ఎందుకు న్యాయం జరగదన్నారు. ఏపీ ప్రజల భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయిందని అన్నారు.