వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండుం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తరాంధ్ర తీరం దాటింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాల ప్రభావం పెరిగింది. విశాఖ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. రాబోయే నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని అంచెనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరిక జారీ చేసారు.
అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదు అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురిసాయి. ముంచింగిపట్టులో అత్యధికంగా 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. కోస్తాంధ్రలో వరి నాట్లు, పత్తి, అపరాల పంటలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగించాయి. ఐదారు రోజులుగా కురుస్తున్న వానలతో పంటలు పుంజుకున్నాయని రైతులు చెబుతున్నారు.