గత పాలకుల అహంబావం, తెలియని తనం, రాజకీయ వివక్షతో పోలవరం ప్రాజెక్ట్ కి నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి జలాల్లో 2వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయని.. అందులో 400 టీఎంసీలను వాడుకుంటే ఏపీని కరువు రహితం చేయవచ్చని తెలిపారు. 1941లోనే ప్రణాళికలు సిద్ధమయ్యాయని.. అప్పుడు కట్టలేక ధవళేశ్వరం బ్యారేజీ కట్టారని గుర్తు చేశారు.
విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడటానికి జూన్ 02 డెడ్ లైన్ గా ఉంది. 7 మండలాలు తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు.. జూన్ 02 దాటితే రెండు రాష్ట్రాల బిల్లును ఆమోదించాలి. ఆ 7 మండలాలను ఏపీకి ఇవ్వడం ప్రాజెక్ట్ కి దోహదమైందని తెలిపారు. ప్రాజెక్ట్ ని పూర్తి చేయగలమనే ధీమాతో ముందుకు వెళ్లామని.. పోలవరం ప్రాజెక్ట్ ను 73 శాతం పూర్తి చేశామని తెలిపారు. పోలవరం పై వర్చువల్ గా 82 సార్లు సమీక్షించినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు.