తిరుమల శ్రీవారి దర్శనం జీవితంలో ఒక్కసారి అయినా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తిరుమల శ్రీవారి కొండపైకి చేరుకోగానే చాలామంది భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉంటారు. నిజానికి తిరుమల ఆది వరాహ క్షేత్రం. అందువల్ల తిరుమలకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ మొదట పుష్కరిణి పక్కన ఉన్న వరాహ క్షేత్రాన్ని దర్శించుకోవాలని ఆచారం పూర్వకాలం నుంచి ఉంది. ఈ విషయాన్ని టిటిడి అప్డేట్స్ ఎక్స్ వేదికగా పేర్కొంటూ భక్తులకు తెలిసే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి వాగ్దానం ప్రకారం… వరాహ స్వామికి మొదటి పూజా, నైవేద్యం సమర్పిస్తారని ప్రతీతి. మొదట వరాహ క్షేత్రాన్ని దర్శించుకున్న అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని పండితులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా… తిరుమలలో శ్రీవారి దర్శనానికి విపరీతంగా భక్తులు తరలి వస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి చాలా సమయం పడుతుందని టిటిడి సంస్థ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దర్శనానికి వెళ్లాలని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.