విజయవాడలో వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై స్పందిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని.. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
వరద బాధితుల విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని దుయ్యబట్టారు. 8 రోజులు గడుస్తున్నా ప్రజలకు ఇప్పటికీ సహాయం అందడం లేదని ఆరోపించారు. సీఎం చంద్రబాబు మీడియా పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇచ్చారని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి నీరు వదులుతున్న సమాచారం ముందే తెలిసినా ప్రజల్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. సుమారు 20 జిల్లాలలో వరద ప్రభావం ఉందన్నారు కన్నబాబు.
45 మంది చనిపోయినా సిగ్గు అనిపించట్లేదా..? అంటూ దుయ్యబట్టారు. రెండు లక్షలకు పైగా రైతులు నష్టపోతే సమీక్ష చేయలేదన్నారు మాజీమంత్రి కన్నబాబు. బాధితుల్లో రోజులు గడుస్తున్నా కొద్దీ భయం పెరుగుతుందని పేర్కొన్నారు. ఓ సినీ నటి గురించి ఆరా తీసిన సీఎంఓ.. వరదల గురించి ఆరా తీయలేదా..? అని విమర్శించారు. ఏపీలో పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా తెలియడం లేదన్నారు.