ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. రూ. 26 వేల కోట్ల భారీ పెట్టుబడితో విశాఖలో రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు జీవీఎల్ నరసింహారావు ప్రకటన చేశారు. రూ. 26,264 కోట్లతో విశాఖలోని రిఫైనరీ ని HPCL ఆధ్వర్యంలో ఆధునీకరించే ప్రక్రియను కేంద్రం చేపట్టిందని.. ప్రస్తుతం సంవత్సరానికి 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన రిఫైనరీ సామర్ధ్యాన్ని 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ఇంత వరకు HPCL చరిత్రలోనే ఈ స్థాయి ప్రొజెక్ట్ చేపట్టడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రక్రియ మొత్తం ముగించాలని లక్ష్యమన్నారు. ఈ రిఫైనరీ సామర్థ్యం పెంపుదల వలన భారత్ ఆరో దశ మోటార్ ఇంధనాలు,ఇంధన రక్షణ, ఇంధన సంక్లిష్టత మెరుగుదల వంటి బహుళ ప్రయోజనాలు చేకూరడమని వెల్లడించారు.
ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లక్షల మందికి జీవనోపాధి కలుగుతుందని.. రాష్ట్రాభివృద్ధికి, పన్నుల రూపంలో ఆదాయానికి ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తుందని.. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు నాంది కానుందన్నారు.