పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్‌పై వరద నీరు ప్రవహంచినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదని ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తెలిపారు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన అంతర్జాతీయ నిపుణులు అనేక అంశాలు ప్రస్తావించారు. వాటిపై అక్కడ ఉన్న కేంద్ర జలసంఘం నిపుణులు, అఫ్రి డిజైన్ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఇంజినీరింగ్ అధికారులు, ఇతర సంస్థల ప్రతినిధులు ఇచ్చే సమాధానాలు వింటూ వారి అనుమానాలను నివృత్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ప్రాజెక్టులో కీలక కట్టడమైన డయాఫ్రం వాల్ గోదావరి భారీ వరదలకు ధ్వంసం కాగా.. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలా, పాతదానికే మరమ్మతులు చేసి, కొంతమేర కొత్తది నిర్మించి పాత కట్టడానికి అనుసంధానించాలా అని ఇంజినీర్లు అడగ్గా.. ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌ను మరమ్మతు చేసుకుంటే సరిపోతుంది కదా అని ఒక నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ డయాఫ్రం వాల్‌కు కొత్త కట్టడం జత చేస్తే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని మరికొందరు ప్రశ్నించగా అలాంటివేమీ ఉండవనీ స్పష్టం చేశారు.