గత కొంతకాలంగా తిరుమల నడకమార్గంలో వన్యమృగాల సంచారం కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆ మార్గంలో చిరుత బారిన పడి ఓ చిన్నారి మృతి చెందిన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో తిరుమల నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని తిరుపతి సీసీఎఫ్ నాగేశ్వర రావు సూచించారు. తిరుమల కాలినడక మార్గాల్లో భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
నడక మార్గాల్లో వన్యమృగాల కదలికలను గుర్తించేందుకు 300 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని.. ఇందుకోసం 100 మంది సిబ్బంది క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారని నాగేశ్వర రావు తెలిపారు. నడక మార్గం పరిసర ప్రాంతాల్లో చిరుత, ఎలుగు బంటి తిరుగుతున్నాయని భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెట్ల మార్గంలో భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని చెప్పారు. టీటీడీ నుంచి సంపూర్ణ సహకారం అందుతోందని వెల్లడించారు.