చంద్రయాన్ -3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టింది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి.. దీని కోసం అహర్నిషలు శ్రమపడిన ఇస్రోకు ప్రపంచం అభినందనలు తెలియజేస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రయాన్-3 విజయోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రయాన్-3 విజయం కోసం అహర్నిశలు కష్టపడిన ఇస్రో శాస్త్రవేత్తలపై తన అభిమానాన్ని చాటుకునేందుకు ఏపీలోని ఓ స్వర్ణకారుడు 700 మిల్లీగ్రాముల బంగారంతో చంద్రయాన్-3 నమూనాను రూపొందించాడు.
పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన పేరూరి వేణుగోపాలకృష్ణ.. దేశం మీద అభిమానంతో రెండు రోజుల పాటు కష్టపడి ఈ నమూనాను తయారు చేసినట్లు తెలిపాడు. ఇప్పటికే 80 మిల్లీగ్రాములతో జాతీయ జెండా, స్వచ్ఛభారత్ లో భాగంగా కళ్ల జోడు, మే డేని పురస్కరించుకుని రిక్షా, తనకి ఇష్టమైన బుల్లెట్ ద్విచక్ర వాహనం, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భగత్ సింగ్ నాణేలను బంగారంతో తయారు చేశాడు. దానితో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ రిటైర్మెంట్ సమయంలో అతని ఫొటో, బ్యాటు ఉండేలా చేసిన నమూనాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం చంద్రయాన్-3 గోల్డ్ నమూనా అందర్నీ ఆకట్టుకుంటోంది.