ఏపీలో వైసీపీ సర్కార్ మూడు రాజధానులపై అసెంబ్లీలో చేసిన ప్రకటనతో మొదలైన అమరావతి ఉద్యమం ఈ నెల 17వ తేదీతో నాలుగో ఏటిలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా ఆ రోజు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్‌లో అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని ఐకాస ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే గుంటూరు పోలీసులకు దరఖాస్తు చేశారు. ఈ సమావేశానికి వివిధ పార్టీల నేతలతో పాటు పలు సంఘాలను ఆహ్వానించనున్నారు.
ఈ క్రమంలోనే ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరుకానున్నట్లు సమాచారం. పొత్తు ప్రకటన తర్వాత ఇద్దరు అగ్రనేతలూ ఒకే వేదిక మీదకు రానుండటంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ, తదితర పార్టీల నేతలతో పాటు దళిత సంఘాలు, వివిధ కుల సంఘాల నేతలను కూడా అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఆహ్వానించినట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ సభలో నేతల ప్రసంగాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.