తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకానికి ఇక్కడే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో తమ రాష్ట్రంలోనూ ఈ స్కీమ్ ప్రారంభించాలని పలు రాష్ట్రాలు యోచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి సర్కార్ ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసే దిశగా కసరత్తు చేస్తోంది. విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి తెలిపారు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని, తాము ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అవసరం మేరకు బస్సుల సంఖ్య పెంచుతామని చెప్పారు. ఎలక్ట్రికల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.