కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది. రాజోలు మండలం లోని చింతపల్లి గ్రామంలో కె .విజయేంద్ర వర్మ ఆక్వా చెరువు వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైపులైన్ లీక్ అయింది. బోరు బావి నుంచి 15 మీటర్లు పైకి గ్యాస్ లీకవటంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. బావి తవ్వించటంతో భూమి లోపల ఉన్న ఓఎన్‌జీసీ పైపులైను దెబ్బతినడంతో గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది. గతంలో కూడా కోనసీమ జిల్లా పరిధిలో ఓఎన్జీసీ గ్యాస్ లీకైన ఘటనలు చాలా ఉన్నాయి. చాలా గ్రామాల మీదుగా ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ వెళ్లటం ఏదో ఒక చోట లీక్ కావటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
తరచూ గ్యాస్ లీక్ కావటంతో కోనసీమ గ్రామాల్లోని ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. తక్షణమే ఇటువంటివి పునరావృతం కాకుండా ఓఎన్జిసి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.