వైసీపీకి మాజీమంత్రి దాడి ఫ్యామిలీ గుడ్ బై చెప్పింది. దాడి వీరభద్రరావు ముఖ్యమంత్రి రాజీనామా లేఖ పంపారు. తాను తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టు ఏకవాక్యంతో రాజీనామా లేఖ ముగించారు మాజీమంత్రి.అయితే రాజీనామా కాపీని సజ్జల, విజయసాయి రెడ్డికి పంపుతూ.. రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేరు ప్రస్తావించారు వీరభద్రరావు. దాడి వీరభద్రరావు 1985లో మొదటిసారి ఎన్టీఆర్ పిలుపు అందుకుని రాజకీయ అరంగేట్రం చేసి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆ తర్వాత 1989,1994,1999 లలో వరుసగా గెలిచారు. అలా నాలుగు సార్లు గెలిచి పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. అనకాపల్లి రాజకీయాలను శాసించారు. 2007 నుంచి 2012 దాకా ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికలలో వైసీపీ ఓటమి చెందడంతో వైసీపీకి దాడి కుటుంబం అంతే వేగంగా రాజీనామా చేసి బయటకు వచ్చారు. మళ్లీ 2019 ఎన్నికల ముందు తిరిగి వైసీపీలో చేరి మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేశారు.