ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం ఏర్పడిందని.. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు విజనరీ నాయకుడన్న గవర్నర్.. 2014లో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు.
2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగింది. అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషిచేశారు. ఆ తర్వాత 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019 నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లింది. అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది.