రాజధాని అమరావతి పనులు ఇకపై శరవేగంతో జరగనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనులను వెంటనే పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాజధాని లో అసంపూర్తిగా ఉన్న మొత్తం 20 పనులకు సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ. 11, 467 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం పిలవనుంది. ఈ మేరకు జీవో 968 ను ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారుల నివాస సముదాయాలు ఉన్నాయి.
మొత్తం రూ. 11, 467 కోట్లలో రూ. 2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారుల పనులు చేపట్టగా.. రూ. 1, 585 కోట్లతో పాల వాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కాల్వల అభివృద్ధి, మూడు రిజర్వాయర్లు నిర్మిస్తారు. అలాగే రూ. 3,525 కోట్లతో అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస భవన నిర్మాణాలను పూర్తి చేస్తారు.