ఆంధ్రావనిలో ఎప్పటి నుంచో ఇసుక తగాదా నడుస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో కూడా ఇసుక ర్యాంపుల నిర్వహణ అన్నది పెద్ద తలనొప్పితో కూడిన వ్యవహారంగానే మారింది. అప్పుడు రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. కానీ రాజకీయ నాయకుల నేరు ప్రమేయం మాత్రం ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంది. అంటే వైసీపీ నాయకులే తప్పిదాలు చేశారు అని చేస్తున్నారని కాదు కానీ వీళ్లతో పాటు టీడీపీ నాయకులకూ ఇలాంటి చరిత్రే ఉందని చెప్పక తప్పదు.
వాస్తవానికి ఇసుక తవ్వకాలకు సంబంధించిన పనులు అన్నీ జేపీ కన్ స్ట్రక్షన్స్ కు అప్పగించారు.కానీ ఆ సంస్థ ఏక పక్షంగా ఉందన్న వాదన ఉంది. పోలవరం ప్రాజెక్టు పనులకు కూడా గోదావరి తీరాన ఇసుక తవ్వుకునేందుకు వీల్లేదని ఆంక్షలు విధించింది. ఆఖరికి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించి, అక్కడ నెలకొన్న అస్పష్ట వాతావరణాన్ని చక్కదిద్దారు. అయితే ప్రధాన మీడియా చెబుతున్న ప్రకారం జేపీ పవర్ వెంచర్స్ కూడా నేరుగా ఇసుక తవ్వకాలు చేపట్టడం లేదని, టర్న్ కీ అనే సంస్థ ఇసుక తవ్వకాలు చేస్తోందని తెలుస్తోంది. దీంతో ఆ సంస్థ ఏం చెబితే అది ఎలా అంటే అలా అన్న విధంగా ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పినా వినని రోజులున్నాయి.
ఇదే సమయంలో భారీ వాహనాలతో ఇసుక తరలిపోయినా కూడా నిబంధనలకు వ్యతిరేకంగా తరలిపోయినా కూడా అధికారులు నిర్థిష్ట ఆదేశాలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. కానీ చిన్న చిన్న టైరు బండ్లను మాత్రం అడ్డుకుని పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మోతాదుకు మించి నిబంధనలు అతిక్రమించి ఇసుక తవ్వకాలు జరుగుతున్నా కూడా అధికారులు ఆపలేకపోతున్నారు. మరి ! మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా ?