ఏపీలో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తీరప్రాంతమైన కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, సోమవారం నుంచి 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
అల్పపీడనం కారణంగా తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొనడంతో ఏపీ హోంమంత్రి అనిత జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కాల్వలు, ఏటి గట్లను పరిశీలించి గండ్లు పడే అవకాశమున్న వాటిని గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. కోస్తా జిల్లాల కలెక్టర్లు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.