తెలంగాణ, ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. తీరం గుండెల్లో తుఫాన్ బెల్స్ మోగుతున్నాయి. బంగాళాఖాతంలో మాటేసిన అల్పపీడనం మరింత బలపడింది. అది వాయుగుండంగా మారి తుఫాన్ రూపంలో విరుచుకుపడతానంటూ భయపెడుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు, చెన్నై తడిసి ముద్దవుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ-వాయవ్యదిశగా కదులుతూ మరింత బలపడింది.
ఇది వాయుగుండంగా మారి ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ శనివారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందంటుంది వాతావరణ శాఖ. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో జల్లులు పడే అవకాశం ఉంది. అటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు అధికారులు తెలిపారు.