బహుభాష విధానం పై నిన్న పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తమిళనాడులోని అధికార డీఎంకే నేతలు స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఆంద్రప్రదేశ్లో కూడా పలువురు పవన్ కల్యాణ్ వ్యాఖ్యల పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను హిందీ భాషను ఎప్పుడూ వ్యతిరేకించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాన్ని నిర్భందంగా అమలు చేయడాన్నే వ్యతిరేకించానని ట్వీట్ చేశారు. NEP-2020 హిందీని కంపల్సరీ చేయాలని చెప్పలేదని, కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆ పాలసీ ప్రకారం మాతృభాష, మరో భారతీయ భాష, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు.