ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకుంది. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. దీంతో పనులు ఆగిపోయాయి. పరిశ్రమలకు తాళం పడింది. ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయింది. ఈ నేపథ్యంలో అంతా గందర గోళంగా మారిపోయింది. అయితే, కరోనా ఎఫెక్ట్‌తో ఇన్ని కష్టాల నేపథ్యంలో ఓ కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మిగిలిన ప్రపం చ దేశాల మాట ఎలా ఉన్నప్పటికీ.. భారత్‌లో ప్రధానమైన సమస్య ఒకటి తెరమీదికి వచ్చింది. ఇది.. ఆ రాష్ట్రం , ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. అదే వలస కూలీలు, కార్మికుల సమస్య! కరోనా నేపథ్యంలో వలస కార్మికులకు పనులు లేకుండా పోయాయి. అంటే.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పొట్ట చేతబట్టుకుని పోయిన కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది.
వెళ్లిన రాష్ట్రంలో పనులు లేక.. తిరిగి వారు సొంత రాష్ట్రాలకు కాళ్లీడ్చుకుంటూ.. వెళ్లిపోతున్న దృశ్యాలు మీడియాలో నిత్యం కనిపిస్తున్నాయి. ఇది ఏ వందల్లోనో ఉందని సరిపెట్టుకున్నా.. ఇది ఏదో ఒక రాష్ట్రానిదే అని భావించినా తప్పులో కాలేసినట్టే.. దాదాపుగా దేశవ్యాప్తంగా పది కోట్ల మందికిపైగా వలస కూలీలు ఉన్నారని తాజా లెక్కలను బట్టి అంచనావేస్తున్నారు. వీటిలో బిహార్, యూపీ, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్, ఒడిశా, ఏపీ, తెలంగాణలకు చెందిన కూలీలుఎక్కువగా ఉండడం గమనార్హం. నిజానికి సొంత రాష్ట్రంలో వీరికి ఉపాధి లభిస్తే.. వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారనేది ప్రధాన ప్రశ్న. ఎక్కడో రాజస్థాన్ నుంచి ఏపీకి, తమిళనాడుకు వచ్చి ఉపాధి పొందుతున్నా.. ఏపీ నుంచి ఎక్కడో ఉన్న మరో రాష్ట్రానికి వెళ్తున్నా.. ఇది ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు ఆర్ధిక నిపుణులు.
అయితే, ఇప్పటి వరకు ఈ సమస్య ఉందని గుర్తించేందుకు కూడా అంగీకరించని రాష్ర్ట ప్రభుత్వాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. అయితే, ఏపీలో ఈ సమస్యపై ప్రభుత్వం తాజాగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఏపీ నుంచి వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాలకు వలస పోతున్న కార్మికులు, కూలీలు, మత్స్యకారుల విషయాన్ని సీఎం జగన్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అసలు ఈ సమస్య ఏంటి? అని తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ఆయన ప్రశ్నించారు. ఎందుకు వారు అలా వెళ్లిపోతున్నారని ప్రశ్నించారు. దీనికి సంబంధించి పరిష్కారాలను తనకు నెల రోజుల్లోనే అందజేయాలని కూడాఆదేశించినట్టు సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే మంత్రి మోపిదేవి వెంకట రమణ చొరవ తీసుకుని మత్స్యకారుల సమస్యను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు.
స్థానికంగా ఉన్న పోర్టుల్లో జట్టీలు లేకపోవడంతో వారు వివిధరాష్ట్రాల సరిహద్దుల్లోకి వెళ్లి వేట సాగిస్తున్నారని చెప్పారు. దీంతో రాష్ట్రంలోని సముద్రతీరం వెంబడి అవకాశం ఉన్న మేరకు కనీసం 10 వేల జెట్టీలను నిర్మించాలని జగన్ ఇప్పటికే ఆదేశించారు. ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక, నైపుణ్యం ఉండి.. స్థానికంగా పనులులేక వలస పోతున్న కూలీల విషయంపై కూడా జగన్ దృష్టి పెట్టారు. వీరికి స్థానికంగా పనులు కల్పించడమో.. లేదా ఉపాధి కల్పించడమో చేయాలని యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
అదేసమయంలో నైపుణ్యం లేని వారికి వారు చుదువుకున్న లేకపోయినా.. వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యం సాధించేలా శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. మొత్తంగా ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వలస కార్మికులసమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తుందని అంటున్నారు పరిశీలకులు. నిజంగా ఇదే జరిగితే.. ఏపీ చరిత్రలో సీఎం జగన్ కొత్త అధ్యాయం సృష్టించిన వారే అవుతారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.