రాజకీయాల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు అనేక వ్యూహాలు ఉంటాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధి నేత, సీఎం జగన్ కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో ప్రధానంగా వ్యక్తులపై ఆధారపడడం కాకుండా.. వ్యవస్థలపైనా.. ప్రజలపైనా ఆయన ఆధారపడుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి మిగిలిన పార్టీల విషయాన్ని చూస్తే.. చాలా మేరకు వ్యక్తులపై ఆధారపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ, జగన్ విషయాన్ని పరిశీలిస్తే.. తనను తాను నమ్ముకోవడంతోపాటు ప్రజలను నమ్మడమే ఆయన అనుసరిస్తున్న రాజకీయ విధానంగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే.. ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడి రాజకీయాలు అక్కడే నడుస్తున్నాయి. ఎక్కడి ప్రాధాన్యాలు అక్కడే ఉన్నాయి. ఈ క్రమంలో జగన్ కూడా అలాంటి ప్రాధాన్యాలనే పట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఎక్కడి అవసరాన్ని గుర్తించి అక్కడ రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గిరిజన నియోజకవర్గాల్లో ప్రధానంగా జగన్ వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. గిరిజన నియోజకవర్గాలను పరిశీలిస్తే..అక్కడి గిరిజనులు సాధారణంగా ఒక నాయకుడికి, ఒక పార్టీకి వారు పూర్తిగా మద్దతిచ్చిన సందర్భాలు మనకు కనిపించవు.
ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుగుణంగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఇలానే గిరిజన నియోజకవర్గాల్లో ఇక్కడి వారి డిమాండ్ల మేరకు జగన్ అడుగులు వేస్తున్నారు. పాడేరు వంటి చోట్ల బాక్సైట్ తవ్వకాలు వద్దనేది ఇక్కడి గిరిజనుల డిమాండ్. నిజానికి గత చంద్రబాబు ప్రభుత్వం తవ్వబోమని చెప్పినా.. తర్వాత కాలంలో మాత్రం తెరచాటుగా అనుమతులు ఇచ్చారు. ఇక, జగన్ అధికారంలోకి రాగానే తవ్వకాలను పూర్తిగా నిలిపివేస్తూ.. జీవో జారీ చేశారు. దీంతో ఇప్పుడు పాడేరు వంటి చోట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో తాగునీరు, వైద్యం కోసం అరకు, పోలవరం వంటి నియోజకవర్గాలు కోరుతున్నాయి. వీటికి ఆయా నియోజకవర్గాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక, కురుపాంలో గిరిజన సంస్కృతికి పెద్దపీట వేశారు. గిరిజన యూనివర్సిటీని నెలకొల్పుతున్నారు. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇలా గిరిజన నియోజకవర్గాల్లో వ్యక్తులు, పార్టీని నమ్ముకోకుండా అభివృద్ధి, అక్కడి ప్రజల డిమాండ్లను పరిష్కరించడం ద్వారా జగన్ ఆయా నియోజకవర్గాల్లో పాగా వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.