ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం విషయంలో అనవసరంగా తప్పు చేస్తున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. మద్యపాన నిషేధం మీద జగన్ ముఖ్యమంత్రి కాక ముందు హామీ ఇచ్చారు. ఆ తర్వాత మద్యం పాలసి కొత్తది ప్రవేశ పెట్టడం బార్ల సంఖ్యను తగ్గించడం, ప్రభుత్వ పరిధిలోకి మద్యం దుకాణాలు తీసుకుని రావడం వంటివి జరిగాయి. ఈ క్రమంలోనే మద్యం ధరలను పెంచారు.
ఇప్పుడు కేంద్రం ఆదేశాల మేరకు లాక్ డౌన్ లో కొన్ని ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనితో ఆరెంజ్, గ్రీన్ జోన్ లో మద్యం అమ్మాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ధరలను పెంచింది కూడా. సగటున ఫుల్ బాటిల్ కి వంద రూపాయల నుంచి 200 వరకు పెరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా సరే లాక్ డౌన్ లో దాదాపు నెల రోజుల నుంచి మద్యానికి ప్రజలు దూరంగా ఉన్నారు.
ఇప్పుడు మళ్ళీ మద్యం అమ్మకాలు ఎందుకు అని ప్రజలు నిలదీస్తున్నారు. ఎలాగూ 40 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని దూరం చేసే అవకాశం ప్రభుత్వానికి వచ్చింది అని, మళ్ళీ ఇప్పుడు ప్రవేశ పెడితే జనం మళ్ళీ అలవాటు పడే అవకాశం ఉంటుందని, దానికి తోడు లాక్ డౌన్ లో పనులు లేక ఖాళీ గా ఉన్న జనం ఇప్పుడు మద్యం అందుబాటులో ఉండటం తో అప్పులు చేసి అయినా తాగే అవకాశం ఉంటుందని,
లాక్ డౌన్ పెరిగే సూచనలే ఉన్నాయి కాబట్టి… మద్యాన్ని ఆపేసి ఉంటే అసలు ఏ గోలా ఉండేది కాదని అంటున్నారు. మద్యపాన నిషేధానికి లాక్ డౌన్ మంచి అవకాశం అని, దాన్ని వాడుకోకుండా ధరలను పెంచి మద్యాన్ని దూరం చేస్తున్నాం అని చెప్పడం ఎంత వరకు సమంజసం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని జగన్ దూరం చేసుకున్నారా లేక ఆదాయం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారా అనేది చూడాలి.