జమిలి ఎన్నికలపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు అంటున్నారని…అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుగా వస్తాయని తెలిపారు. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దని తెలిపారు. ప్రజల తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నామని ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఈ మేరకు జగన్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆగ్రహించారు. అసెంబ్లీకి వెళ్లినా వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వెల్లడించారు జగన్.

క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని… మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలని కోరారు. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలని… ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టేనని వెల్లడించారు. అందుకనే ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను, అండగా ఉంటానని స్పష్టం చేశారు.