కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో నెలకొన్న వర్గపోరుకు ఇప్పట్లో తెరపడేలా లేదు. వారం రోజుల క్రితం సీఎం జగన్ చొరవ తీసుకుని స్వయంగా ఎమ్మెల్యే వంశీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు మధ్య చేతిలో చేయి వేపి పరిష్కారం చూపినా కూడా వీరి మధ్య జగన్ చేసిన పంచాయితీ అట్టర్ ప్లాప్ అయినట్టే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ ఆ పార్టీకి దూరమై వైసీపీ చెంత చేరాడు. అయితే అక్కడ వంశీ చేతిలో ఓడిన యార్లగడ్డ వెంకట్రావుకు జగన్ కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ పదవి ఇచ్చారు. కొద్ది రోజులు యార్లగడ్డ సైలెంట్‌గా ఉన్నా 2014లో వంశీ చేతిలో ఓడిన దుట్టా రామచంద్రరావు మాత్రం వంశీపై దూకుడుగానే ముందుకు వెళ్లారు.
ఆ తర్వాత వంశీకి వ్యతిరేకంగా దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేతులు కలపడంతో ఈ మూడు వర్గాల మధ్య వార్ మరింత ముదిరింది. తాజాగా యార్లగడ్డ జన్మదిన వేడుకలకు నియోజకవర్గంలో పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వార్ రాజుకుంది. ఈ క్రమంలోనే ఫైర్ అయిన వెంకట్రావు తాను వంశీతో కలిసి పనిచేయలేనని.. ఈ విషయాన్ని తాను జగన్‌కే చెప్పానంటూ కుండబద్దలు కొట్టారు. చివరకు వైవి సుబ్బారెడ్డి వంశీని, మంత్రి నానిని పిలిపించి అందరు కలిసి పనిచేయాలని సూచించారు.
సుబ్బారెడ్డి మాటను కూడా ఈ నేతలు పట్టించుకోలేదు. చివరకు జగన్ వారం రోజుల క్రిందట నియోజకవర్గానికి వచ్చినప్పుడు అక్కడ జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభోత్సవంలో జగన్ స్వయంగా జోక్యం చేసుకుని యార్లగడ్డ చేయి తీసుకువెళ్లి వంశీ చేతిలో వేసి ఇద్దరు కలిసి పనిచేసుకోండన్న సంకేతాలు పంపారు. ఇక్కడ యార్లగడ్డ జగన్‌కు వంశీపై ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా జగన్ ప్టించుకోలేదు. ఆ వెంటనే వంశీ, మంత్రి కొడాలి నాని ఇద్దరు కలిసి ఉండగానే వంశీ తానే గన్నవరం వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉంటానిన చెప్పారు.
సీఎం పంచాయితీ చేసిన కొద్ది గంటలకే మళ్లీ ఈ ఇద్దరు నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరించారు. వంశీ తాను అందరిని కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని చెపుతుంటే.. దుట్టా, యార్లగడ్డ ఇద్దరు కూడా తాము వంశీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని చెపుతున్నారు. ఇక జగన్ పంచాయితీ పట్ల వంశీ వర్గం ఆనందంతో ఉంటే, యార్లగడ్డ మాత్రం రగిలిపోతున్నారట. ఏదేమైనా సీఎం చేతిలో చేయి వేసి పంచాయితీ చేసినా గన్నవరంలో ఈ మూడు స్తంభాలాట వార్‌కు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ బ్రేక్ పడే ఛాన్స్ లేదు.
-vuyyuru subhash