దోచుకోవడానికే ఆడుదాం ఆంధ్ర అంటూ జగన్ కొత్త డ్రామాకు తెరతీసారని ఆరోపించారు మాజీమంత్రి కొల్లు రవీంద్ర. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి సీదిరి అప్పలరాజు విసిరిన సవాల్ కి స్పందించి అభివృద్ధి విషయంలో తాము బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పడంతో చర్చకు రాలేక అప్పలరాజు తోక ముడిచారని అన్నారు. యువగళం పాదయాత్ర పై విమర్శలు చేస్తూ అప్పలరాజు బహిరంగ లేఖ రాశారు. బహిరంగ చర్చకు సిద్ధమని తాము సవాల్ ని స్వీకరించామన్నారు కొల్లు రవీంద్ర.
విజయవాడ ప్రెస్ క్లబ్ వద్దకు ఈరోజు 11 గంటల వరకు రావాలని చెప్పామని.. కానీ చర్చకు రాకుండా తోక ముడిచిన మీరు లోకేష్ గురించి మాట్లాడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి హయాంలో బీసీలకు ఎక్కువ అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలన్నారు. చేతి వృత్తుల వారికి జీవన ఉపాధి లేకుండా చేశారని.. ఆడుదాం ఆంధ్ర వల్ల ప్రజలకు ప్రయోజనం ఏంటన్నారు. స్టేడియాల అభివృద్ధి లేదు, క్రీడాకారులకు ప్రోత్సాహం లేదన్నారు. చర్చకు రాకుండా పారిపోయిన అప్పలరాజు ఇంకోసారి వాగితే రోడ్లమీద తిరగనివ్వమని హెచ్చరించారు కొల్లు రవీంద్ర.