కరోనా కు సంబంధించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్ మీద సిఎం జగన్ సీరియస్ అయ్యారు. అధిక ఫీజు వసూలు చేస్తున్న కోవిడ్ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలానే ఆ ఆస్పత్రుల మీద కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు జగన్ ‘స్పందన’ కార్యక్రమం మీద మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దాని కంటే కోవిడ్ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
ఇక కృష్ణ, గోదావరి వరదలు మీద కూడా ఆయన కలెక్టర్లకి కీలక సూచనలు చేశారు. తగ్గుముఖం పట్టినందున పంట నష్టంపై అంచనా వేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సెప్టెంబర్ 7లోగా అంచనాలు రూపొందించి, అందచేయాలని సూచించారు. అలానే ఆలోపే గోదావరి ముంపు బాధితులకు రెండు వేల రూపాయలు అదనపు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అలానే అంటురోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అంతే కాక వరదల సమయంలో ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు బాగా పని చేశారని ప్రశంసించారు.