ఏపీలో టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించిన విషయం తెలిసిందే. అలాగే కృష్ణా జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలకు ఇద్దరు అధ్యక్షులని పెట్టారు. విజయవాడ పార్లమెంటరీకి నెట్టెం రఘురాంని, మచిలీపట్నం పార్లమెంటరీకి కొనకళ్ళ నారాయణని నియమించారు. అయితే ఇద్దరు నేతలకు సౌమ్యులుగా పేరుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీరికి సహకరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీరిలో నెట్టెం రఘురాం కమ్మ నేత కాగా, కొనకళ్ల నారాయణ బీసీ నేత.
కానీ కొనకళ్ళ నారాయణకు టీడీపీ మరో సీనియర్ కాగిత వెంకట్రావుల మధ్య గ్యాప్ అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. కొనకళ్ళ మచిలీపట్నం పార్లమెంటరీ స్థానానికి అధ్యక్షుడుగా ఉండటంతో, ఆ పార్లమెంట్ స్థానంలో ఏడు నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేసే బాధ్యత ఆయనదే. ఇక పెడన నియోజకవర్గం మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలోకి వస్తుంది. అయితే మిగతా అసెంబ్లీ స్థానాలకు చెందిన ఇన్చార్జ్లు కొనకళ్ళని కలిసి అభినందనలు తెలియజేశారు.
కాగిత ఫ్యామిలీ మాత్రం కొనకళ్ళని కలిసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే పెడన స్థానాన్ని కొనకళ్ళ తన కుమారుడుకు దక్కించుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లోనే కాగిత అనారోగ్యంతో పోటీ నుంచి తప్పుకుని, తన తనయుడు వెంకట కృష్ణ ప్రసాద్ని బరిలో నిలిపారు. అయితే కాగిత ఫ్యామిలీని ఎలాగైనా సైడ్ చేసి, పెడన స్థానంలో దిగాలని కొనకళ్ళ ఫ్యామిలీ చూసింది. కుదిరితే తనకు, లేదా తన తనయుడుకు పెడన టిక్కెట్ దక్కించుకోవాలని ట్రై చేశారు.
చంద్రబాబు మాత్రం పెడన కాగిత తనయుడుకు అప్పగించి, మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో కొనకళ్ళనే నిలబెట్టారు. ఇక జగన్ గాలిలో ఇద్దరు ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కొనకళ్ళ పార్లమెంటరీ అధ్యక్షుడు అయ్యాడు. దీంతో పలువురు నేతలు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కాగిత ఫ్యామిలీ మాత్రం కొనకళ్ళని కలవలేదు. దీని బట్టి చూసుకుంటే కాగిత, కొనకళ్ళ ఫ్యామిలీ మధ్య గ్యాప్ అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.
-vuyyuru subhash