ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నేటి నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 01వ తేదీ వరకు.. అంటే మొత్తం 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ వేడుకల కోసం ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శ్రీశైలం ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో పెయింటింగ్‌లతో సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల కొండలు దాటుకుని శ్రీశైలం తరలివస్తారు.
శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం అధికారులు విసృత ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, వసతి, వైద్యం, శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు.. మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రసాదం తదితర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేశారు.ముఖ్యంగా శ్రీస్వామివారి దర్శనానికి భక్తులు ఐదురోజుల ముందు నుంచే పాదయాత్రతో శ్రీశైలం తరలివస్తారు. వారికోసం శ్రీశైలానికి 10 కిలోమీటర్లు దూరంలోని కైలాశద్వారం, భీమునికొలను, హటకేశ్వరం మెట్ల మార్గంలో వచ్చే భక్తులు సేద తీరేందుకు భారీ షెడ్లు నిర్మించారు. తాగేందుకు మంచినీటి ట్యాంకర్లను సిద్దం చేశారు. పాదయాత్రతో వచ్చే భక్తుల కోసం మట్టి రోడ్లను మరమ్మత్తులు చేసి రోడ్డుపొడువున గ్రావల్ పోసి ట్రాక్టర్లతో చదును చేయించారు.