ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం.. నో చెప్పడంతో వేధించడం ఇప్పుడు మామూలైపోయింది. చాలా మంది అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తున్నారు. నో చెబితే ఆత్మహత్య చేసుకుని చనిపోవడమో.. లేక ఆ అమ్మాయిని చంపడమో చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని విశాఖటప్నంలో చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఓ యువతి, ఆమె తల్లిపై కత్తితో కిరాతకంగా దాడి చేశాడు.
అసలేం జరిగిందంటే..
విశాఖపట్నంలోని కొమ్మాది స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. నవీన్ అనే యువకుడు లక్ష్మి అనే మహిళ, ఆమె కుమార్తె దీపికపై కత్తితో దాడి చేశాడు. ప్రేమోన్మాది నవీన్ దాడిలో తల్లి లక్ష్మి మృతి చెందింది. కుమార్తె దీపికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు దీపికను సమీపంలోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. తల్లి, కుమార్తెపై దాడి చేసి యువకుడు నవీన్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.