రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ భూములు ప్రభుత్వానికే చెందుతాయంటూ ఇటీవల టీజీఐఐసీ చేసిన ప్రకటనతో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది.
కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని పిటిషన్లు కోరగా.. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. హెచ్‌సీయూ తరఫున ఎల్. రవిశంకర్ వాదనలు వినిపిస్తూ గతేడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 54 తీసుకొచ్చిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీకి ఇస్తోందని.. అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల వద్ద చెట్లను కొట్టేస్తున్నారని.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలని కోర్టును కోరారు. కొన్ని రోజులుగా ఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని కోర్టుకు వివరించారు.