ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. వాతావరణ అనిశ్చితి ప్రభావంతో ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. పగటి పూట భానుడు భగభగలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. సాయంత్రం కాగానే చిరుజల్లులు కురవడంతో కాస్త సేదతీరుతున్నారు. అయితే రాగల మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
శుక్రవారం రోజున శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక శనివారం నాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అనకాపల్లి, ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడుతాయని వెల్లడించారు. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తాయన్న వాతావరణ సూచనతో రైతులు ఆందోళన చెందుతున్నారు.