టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రాహుల్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే తన జన్మదినాన్ని పురస్కరించుకుని కేఎల్ రాహుల్ తన కుమార్తె పేరును ప్రకటించారు. కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి దంపతులు ఇటీవలే తమ జీవితాల్లో పండంటి ఆడబిడ్డను ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా తమ గారాలపట్టిని ప్రపంచానికి పరిచయం చేస్తూ.. ఆమె పేరును ప్రకటించారు. తమ కుమార్తెకు ఇవారా విపుల రాహుల్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. పాపను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసిన ఈ జంట ‘‘మా బేబీ గర్ల్.. మా ప్రపంచం. ఇవారా – భగవంతుడి కానుక’’ అని తమ పోస్టు కింద క్యాప్షన్ రాసుకొచ్చారు. ‘ఇవారా’ అనేది సంస్కృత మూలాలున్న పేరు. ఇక విపుల అనేది ఆ పాప జేజమ్మ పేరు (అమ్మమ్మ తల్లి పేరు) రాహుల్ అనేది తండ్రి పేరు. అని ఈ జంట తమ కుమార్తె పేరును వివరించింది.