సీపీఎస్ అంశంపై ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. సీపీఎస్ రద్దు అనే అంశం ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నారు. జీపీఎస్ అనేది మా ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు విషయంలో మేం ఇంతకుమించి చేయలేమని .సీపీఎస్ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని మా రిక్వెస్ట్ అని విజ్ఞప్తి చేశారు. జీపీఎస్ విధానం ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగా ఉందని మేం చెప్పడం లేదు. కానీ జీపీఎస్ విధానంలో ఏమైనా చెప్పదలచుకుంటే మేం చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే సీపీఎస్ విధానం రద్దును కేంద్రం ఎందుకు ఆమోదించడం లేదని బీజేపీ వాళ్లని అడగాలని సూచించారు.
ఏపీలో సీపీఎస్ విధానాన్ని రద్దుచేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. సీపీఎస్ స్థానంలో ఏపీ గ్యారంటెడ్ పెన్షన్ స్కీమ్ బిల్లు 2023 ద్వారా కొత్త విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి కొత్తగా వచ్చారు. తాను వచ్చాను అనే విషయం అందరికీ తెలియాలి, పురందేశ్వరి మద్యం అంశాన్ని లేవనెత్తారు అంటూ సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మరో వైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అధికారుల పాత్ర ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాకేం ప్రేమ చంద్రారెడ్డి మీద ప్రత్యేక ప్రేమ లేదన్నారు. కానీ అధికారులు అభ్యంతరం చెప్పక.. ఫైల్ సీఎం దగ్గరకు వెళ్తుంది. దానికి సీఎందే బాధ్యత అవుతుందన్నారు. రిమాండ్ కొనసాగింపు సందర్భంగా తానేం తప్పు చేయలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ.