రాజుగారిది మేకపోతు గాంభీర్యం చూశారా…!

-

రఘురామకృష్ణంరాజు…ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న పేరు..2019 ఎన్నికల ముందు అనేక పార్టీలు  మారి, చివరికి తెలుగుదేశం తరుపున సీటు ఫిక్స్ అయిందనే తరుణంలో వైసీపీలోకి జంప్ కొట్టి నరసాపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక గెలిచిన దగ్గర నుంచి రాజుగారి యవ్వారం కాస్త తేడాగానే ఉండేది. వైసీపీలో ఉంటూనే ఆ పార్టీపైనే చిన్నచిన్నగా ఎదురుదాడి చేస్తుండేవారు. మధ్యలో ఒకసారి ఫుల్‌గా రివర్స్ అయ్యి, వైసీపీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీకి చెందిన నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు.

అక్కడ నుంచి మొదలు రాజుగారు పక్కా వైసీపీ ప్రత్యర్ధిగా మారిపోయారు. ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టడం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చేస్తున్నారు. దీన్ని టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేయడం చేస్తుంది. ఇలా తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాజుగారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. అయితే రాజుగారికి బీజేపీ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయనే విషయం తెలిసిందే.

దీంతో ఆయనపై వేటు వేయడం అనేది సులువు కాదని వైసీపీ వ్యతిరేక వర్గాలు భావించాయి. అలాగే రాజు గారు కూడా తనని ఏమి చేయలేరని ధీమాతోనే మాట్లాడేవారు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే రాజుగారిది మేకపోతు గాంభీర్యం అని అర్ధమవుతుంది. ఎందుకంటే ఇటీవల ఎంపీకి చెందిన సంస్థలపై సి‌బి‌ఐ దాడులు జరిగాయి. అలాగే ఎఫ్‌ఐ‌ఆర్ కూడా నమోదైందని స్వయంగా ఆయనే చెప్పారు. దీని వెనుక ఎవరు ఉన్నారో కూడా తెలుసని హడావిడి చేశారు.

ఇక షాక్ వెంటనే, తాజాగా రాజుగారిని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పదవి నుంచి తప్పించారు.  ఈ పదవి తన సొంతంగా తెచ్చుకున్నానని రాజుగారు పలు సందర్భాల్లో  చెప్పారు. అయితే ఇప్పుడు అదే పదవి నుంచి తప్పించారు. మళ్ళీ ఆ పదవిని వైసీపీ ఎంపీ బాలశౌరికి ఇచ్చారు. ఈ పరిణామాలని బట్టి చూస్తే రాజుగారు పూర్తిగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది.

-vuyyuru subhash

Read more RELATED
Recommended to you

Exit mobile version