భారీ వర్షాలతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో దిగువకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ దిగువన లంక గ్రామాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మూడ్రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వరద నీరు భయపెడుతోంది. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో వరద ఉధృతి భారీగా పెరిగింది..
వరద పోటెత్తడంతో చాలా లంకలు ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఈ వరద నీరు దెబ్బకు వేల హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ నీటమునిగింది. వరద పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ వరద అంతకంతకూ పెరుగుతున్నందున అధికారులు అలర్ట్ అయ్యారు.