విజయవాడలో వరదలకు పలు కాలనీలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. అయితే వరద బాధితులందరికీ పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖ ద్వారా రేపటి నుంచి నిత్యవసర సరుకులు పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తాజాగా ఆయన విజయవాడ కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నో వరదలను చూశాం. కానీ ఈసారి వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అధికార యంత్రాంగం అహర్నిశలు పని చేసి సహాయక చర్యలు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి విజయవాడలో 179వ వార్డు, 3 గ్రామ సచివాలయ పరిధిలోని వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ వంటనూనె, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిపాయలు, 2కిలోల బంగాళదుంపలు రెండు బ్యాగ్ లుగా చేసి పంపిణీ చేయనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.