కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. రెెండు, మూడు రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటుంది. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా చట్టం చేసింది గత ప్రభుత్వం. కానీ వైసీపీ చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కెబినెట్ ఆమోదం తెలిపింది.ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును గవర్నర్ వద్దకు పంపనుంది ప్రభుత్వం. ఇవాళ లేదా రేపటిలోగా ఆర్డినెన్సును ఆమోదించనున్నారు గవర్నర్.
మొత్తం 3736 మద్యం షాపుల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం.. ఇందులో 340 షాపులను కల్లు గీత వృత్తి కులాలకు రిజర్వ్ చేయనుంది. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశం పైనా అబ్కారీ శాఖ కసరత్తు చేస్తుంది. కల్లు గీత వృత్తి కులాల జనాభా ఏయే జిల్లాల్లో.. ఏయే నియోజకవర్గాల్లో ఎంత మేరకు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తుంది. ఆయా వివరాలను బీసీ సంక్షేమ శాఖ నుంచి తీసుకుంటున్న ఎక్సైజ్ శాఖ.. కల్లు గీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను రిజర్వ్ చేయనుంది.