ఏపీ రాజధాని పనుల శంకుస్థాపన కోసం మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని అమరావతి పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొల్లు రవీంద్రలతో ఈ కమిటీని రూపొందించింది.
ప్రధాని పర్యటనకు నోడల్ అధికారిగా జి.వీరపాండియన్‌ను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని పర్యటన ఏర్పాట్లతో పాటు అమరావతి నిర్మాణ పనుల శంకుస్థాపన, పెట్టుబడుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షించనుంది. మరోవైపు ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. దాదాపు 5 లక్షల మంది పాల్గొనేలా బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు మోదీ అమరావతి పనులకు మరోసారి శంకుస్థాపన చేయనున్నారు.