‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీలో సుభాష్ అనే పాత్రలో నటించిన నటుడు శ్రీనాథ్ భాసిపై నిర్మాత హసీబ్ మలబార్ తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీనాద్ డ్రగ్స్ తీసుకోకుండా షూటింగులో పాల్గొనలేడని ఆరోపించారు. అతడి ప్రవర్తనతో ఎంతో విసిగిపోయానని.. తమ సినిమా షూటింగ్ సమయంలో గాంజాయి కావాలని డిమాండ్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. అతడు మంచి వాడు కాదంటూ వ్యాఖ్యానించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నా అని.. కానీ అలా చేస్తే తన సినిమా ఆగిపోతుందని భయపడ్డానని తెలిపారు.
శ్రీనాథ్ భాసి హీరోగా ‘నముక్కు కోడతియిల్ కానమ్’ సినిమా నిర్మించినట్లు నిర్మాత హసీబ్ తెలిపారు. అయితే ఓ రోజు తెల్లవారుజాము 3 గంటలకు హీరో స్టాఫ్ తనకు కాల్ చేసి తమ హీరో గంజాయి తీసుకురమ్మని అడుగుతున్నాడని.. అది ఉంటేనే షూటింగులో పాల్గొంటాడని చెప్పడంతో తాను షాక్ అయ్యానని చెప్పారు. అంతే కాదు సెట్లోకి గాంజా తెచ్చుకునే వాడని, కారవాన్ లో దాచిపెట్టి షూట్ మధ్యలో వెళ్లి సేవించేవాడని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే తన వాహనంలోకి ఎవర్నీ అనుమతించే వాడు కాదని అన్నారు.